రాష్ట్రస్థాయిలో రాణించాలి: తహసిల్దార్ కిరణ్ కుమార్
నవగీతం,కొడిమ్యాల:
కొడిమ్యాల మండల స్థాయి సీఎం కప్–2వ ఎడిషన్ ఎంపిక క్రీడా పోటీలు మంగళవారం విజయవంతంగా ముగిశాయి.ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో మధ్యాహ్నం 3 గంటలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి ఐత శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా మండల తహసిల్దార్ కిరణ్ కుమార్ హాజరై మాట్లాడారు.క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్ఐ సందీప్ కుమార్‌తో కలిసి విజేతలకు బహుమతులు అందజేశారు.కబడ్డీ పురుషుల విభాగంలో సూరంపేట జట్టు ప్రథమ, నాచుపల్లి ద్వితీయ స్థానాలు సాధించగా, మహిళల విభాగంలో సూరంపేట ప్రథమ, తిరుమలాపూర్ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. వాలీబాల్ బాలుర విభాగంలో హిమ్మత్ రావు పెట్, ప్రథమ, నమిలికొండ ద్వితీయ స్థానాలు దక్కించుకోగా, బాలికల విభాగంలో నమిలికొండ ప్రథమ, పూడూరు ద్వితీయ స్థానాలు సాధించాయి.ఖో-ఖో బాలుర విభాగంలో కొడిమ్యాల ప్రథమ, నాచుపల్లి ద్వితీయ స్థానాలు గెలుచుకోగా, బాలికల విభాగంలో నాచుపల్లి ప్రథమ, కొడిమ్యాల ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. చెస్ బాలుర విభాగంలో కొడిమ్యాలకు చెందిన గౌతం కృష్ణ ప్రథమ స్థానం, నాచుపల్లికి చెందిన సుశాంత్ ద్వితీయ స్థానం సాధించారు. అథ్లెటిక్స్‌లో బాలుర విభాగంలో నాచుపల్లి, బాలికల విభాగంలో నమిలికొండ జట్లు ఓవరాల్ ఛాంపియన్లుగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కిరణ్ కుమార్, ఎంఈఓ ఐత శ్రీనివాస్, ఎస్ఐ సౌదం సందీప్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఏ. విజయేంద్ర, ఎస్జీఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి లక్ష్మీ రామ్ నాయక్, ఎస్జీఎఫ్ మండల కార్యదర్శి బూట్ల రాజ మల్లయ్య, హమీదుల్లాఖాన్, ఫిజికల్ డైరెక్టర్లు బీరయ్య, శివకృష్ణ, అనుప్ రెడ్డి, మల్లయ్య, ఎండ్రికాయల శ్రీనివాస్, సీఆర్పీ చందు తదితరులు పాల్గొన్నారు.

