7గురు నిందితుల అరెస్టు – 15 తులాల బంగారం, 32 తులాల వెండి స్వాధీనం
సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల పట్టివేత: ఎస్పీ అశోక్ కుమార్
నవగీతం, మెట్ పల్లి:
మెట్‌పల్లి, పరిసర ప్రాంతాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడిన ఏడుగురు నిందితులను మెట్‌పల్లి పోలీసులు గురువారం అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ తెలిపారు. నిందితుల నుంచి 15 తులాల బంగారం, 32 తులాల వెండి మరియు ఒక ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గురువారం మెట్‌పల్లి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… మెట్‌పల్లి పట్టణంలో గత జనవరి నెలలో వరుసగా ఆరు దొంగతనాల ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు.ఈ వరుస దొంగతనాల కేసులను అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని, మెట్‌పల్లి డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్, ఎస్‌ఐలు కిరణ్ కుమార్, అనిల్, నవీన్‌లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.

ప్రత్యేక బృందాల ఏర్పాటు – నిందితుల పట్టివేత
ప్రత్యేక బృందాలు మెట్‌పల్లి, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించి, సీసీటీవీ ఫుటేజ్, డాగ్ స్క్వాడ్ ఆధారంగా విచారణ కొనసాగించి నిందితులకు సంబంధించి కీలక సమాచారం సేకరించినట్లు తెలిపారు.విచారణలో భాగంగా మంగళవారం నాడు మెట్‌పల్లి కొత్త బస్టాండ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పండుగ రమేశ్, పల్లెపు రమేశ్‌లను సీఐ మరియు సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. వారి వద్ద నుంచి దొంగిలించిన 3.5 తులాల బంగారు పుస్తెల తాడు మరియు ఒక ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

పై నిందితులు ఇచ్చిన సమాచారంతో మిగతా నిందితులైన గుంజే గంగాధర్, ఒర్సు గంగమణిలను కూడా అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. గంగాధర్ వద్ద నుంచి 2 తులాల బంగారు పుస్తెల తాడు, 1 తులం బంగారు చైన్,గంగమణి వద్ద నుంచి 2 తులాల బంగారు నెక్లెస్, 18 తులాల వెండి పట్టా గొలుసులు, నేరాల్లో పాల్గొన్న గైని కిరణ్ వద్ద నుంచి 11 తులాల వెండి పట్టా గొలుసులు, పెద్దూరు మల్లేశ్వరి వద్ద నుంచి 3 తులాల వెండి బ్రేస్‌లెట్‌లు,దొంగతనపు సొత్తు కొనుగోలు చేసిన ఇందూరి రాకేష్ వద్ద నుంచి 3 తులాల బంగారు నెక్లెస్, 1 తులం బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మొత్తంగా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు, 32 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.
సీసీటీవీ, డాగ్ స్క్వాడ్ ఆధారాలతో కేసు ఛేదన
దొంగతనం కేసును ఛేదించడంలో సీసీటీవీ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ ద్వారా కీలక ఆధారాలు లభించాయని, వాటి ఆధారంగానే కేసును విజయవంతంగా ఛేదించామని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా దొంగతనం కేసును ఛేదించిన మెట్‌పల్లి పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ అభినందించి, రివార్డులు అందజేశారు.జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివాస గృహాలు మరియు వాణిజ్య సముదాయాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు కాల్ చేయాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. ఈ యొక్క ప్రెస్ మీట్ లో డీఎస్పీ రాములు, మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్, ఎస్‌ఐ కిరణ్ కుమార్,అనిల్,నవీన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

