బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
నవగీతం,తిరుపతి :
తిరుపతి సప్తగిరుల్లో వెలసిన పవిత్ర క్షేత్రమైన శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వరస్వామి దేవాలయంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సప్తగిరులలో అత్యంత పుణ్యప్రదమైన కపిలతీర్థంలో స్నానం చేయడం వల్ల దేవతలతో పాటు పితృదేవతలు సంతోషిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.

భక్తులు ముందుగా విఘ్నేశ్వరుని దర్శించుకుని, అనంతరం కామాక్షి సమేత కపిలేశ్వరస్వామిని దర్శించుకోవడం ద్వారా సంతానం, శ్రేయస్సు, కుటుంబ సుఖసంతోషాలు కలుగుతాయని వివరించారు.అలాగే కాలభైరవ స్వామి, కోటిలింగాలు, బిల్వ వృక్షం దర్శనం చేసి బయలుదేరితే మరింత శుభఫలితాలు లభిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ ఈవో శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ కె.పి. చంద్రశేఖర్, అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నరు


