కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాట్ల సోమయ్య డిమాండ్
మల్లాపూర్, సెప్టెంబర్8,(నవగీతం): శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాత మధు చేసినట్లు పేర్కొంటున్న అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాట్ల సోమయ్య అన్నారు. తాత మధును శాసనమండలి నుంచి డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) పార్టీ,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతారని చెప్పిన కేసీఆర్.. దళితులను మోసం చేసి తానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారని ఆరోపించారు. అలాగే దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మరోసారి మోసం చేశారని విమర్శించారు.నేరెళ్ల ఘటనలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారనే కారణంతో దళితులపై పోలీసులు దారుణంగా వ్యవహరించిన తీరు, అప్పటి టీఆర్‌ఎస్ నాయకుల వైఖరిని దళిత సమాజం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు.
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు టీఆర్‌ఎస్ సభ్యుల వైఖరిని ఖండిస్తున్నా కాంగ్రెస్ సర్పంచ్ లు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున టీఆర్‌ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ, నల్ల టీ-షర్టులు ధరించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో అసెంబ్లీకి రావడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసులను నెట్టివేస్తూ భౌతిక దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలో ఇలాంటి ఘటనలకు పాల్పడటం సరికాదని, వారి చర్యలను తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న వెయ్యి రోజుల ప్రజా పాలనపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుండటాన్ని బీఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని వారు విమర్శించారు. అందుకే ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కలిగించేలా వివిధ రకాలుగా రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, ఆ పార్టీ సీట్లు సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. వచ్చే పదేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గున్నాల శ్రీనివాస్, ఉప సర్పంచ్ గడ్డం సోమారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇట్టెడి నారాయణరెడ్డి, సర్పంచులు కనుమూల వెంకటేష్,తేలు నరేష్,నాయకులు నల్ల రాజన్న,బద్దం నర్సారెడ్డి, రొండ్ల రాజారెడ్డి, శాఖపురపు కిరణ్,ఎర్ర భూమయ్య,ఆనంద్ గౌడ్, ఎం.డి.షబ్బీర్,ఎం.డి.జమాల్, జీవన్ రెడ్డి తదితరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
