Friday, April 17, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలమెట్‌పల్లిలో చైనా మాంజా బీభత్సం: నాలుగేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు, విక్రేత పై కేసు నమోదు

మెట్‌పల్లిలో చైనా మాంజా బీభత్సం: నాలుగేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు, విక్రేత పై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి

సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా విక్రయాలు ఒక చిన్నారి ప్రాణం మీదకు తెచ్చాయి. మెట్‌పల్లి పట్టణానికి చెందిన జెట్టి లింగం మనవడు, నిజామాబాద్ నివాసి వోడ్దేపు శ్రీకాంత్ కుమారుడైన శ్రీహన్ (4) గురువారం దుబ్బవాడలోని తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా, గాలిపటం నుండి తెగిపడిన చైనా మాంజా దారం బాలుడి మెడకు బలంగా చుట్టుకుంది. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే విచారణ చేపట్టారు. ఈ విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  నిందితుడు మెట్‌పల్లి పట్టణం సుల్తాన్‌పుర కాలనీకి చెందిన షేక్ సిద్ధిక్ హుస్సేన్ (40) తన నివాసంలో స్టేషనరీ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. నిందితుడు లాభాపేక్షతో గత కొంతకాలంగా సంక్రాంతి సీజన్‌లో ఇట్టి నిషేధిత చైనా మాంజాను వేరే ప్రాంతం నుండి కొనుగోలు చేసి విక్రయిస్తున్నాడు.ఈ ఏడాది కూడా నిందితుడు చైనా మాంజా రీళ్లను కొనుగోలు చేసి, నిషేధిత మాంజా అని తెలిసి కూడా, కేవలం లాభాల కోసం చిన్నపిల్లలకు మీటర్ల చొప్పున దీనిని విక్రయించాడు. నిందితుడు షేక్ సిద్ధిక్ హుస్సేన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: పోలీసుల హెచ్చరిక

మెట్‌పల్లి పట్టణంలో చోటుచేసుకున్న తాజా ప్రమాదం నేపథ్యంలో పోలీసులు ప్రజలకు వ్యాపారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను కొనుగోలు చేయడం, నిల్వ ఉంచడం లేదా విక్రయించడం తీవ్రమైన నేరమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దారాలు పర్యావరణానికే కాకుండా, మనుషుల మరియు పక్షుల ప్రాణాలకు ఎంతో ప్రమాదకరమని, వీటిని వాడటం వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా చైనా మాంజాను విక్రయిస్తున్నట్లు తెలిస్తే, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గానీ లేదా డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రాణనష్టాన్ని నివారించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular