నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్డీవో కార్యాలయంను జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జాతీయ రహదారి పనులకు సంబంధించిన అవార్డు కాపీలను త్వరగా ఇవ్వాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును శూన్యంగా పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ను మరింత వేగవంతం చేస్తూ అలాగే మ్యాపింగ్ లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, తప్పు ఎంట్రీ లు జరగకుండా ప్రతి ఓటరు మ్యాప్ అయ్యేవిధంగా ప్రతి ఇంటినుండి ఖచ్చితమైన మరియు నిర్ధిష్టమైన వివరాలు సేకరించేలా అన్ని స్థాయి ల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ లు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

