నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డా. కె రామకృష్ణ సారధ్యంలో గురువారం ఉపన్యాసక బృందం రాబోయే 2026-27 సంవత్సరంలో ప్రవేశాల కోసమై ప్రవేశ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక జగిత్యాల సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మల్యాల, తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, తాటిపల్లి, ప్రభుత్వ జూనియర్ కళాశాల గొల్లపల్లి, ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, గొల్లపల్లి మొదలగు కళాశాలలను సందర్శించి విద్యార్థులకు స్వయం ప్రతిపత్తి హోదా గల జగిత్యాల ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో గల వివిధ సౌకర్యాలను గురించి అవగాహన కల్పించారు. కళాశాలలో బి.యస్సీ. యం.పి.సి., యం.పి.సిఎస్., బి.జడ్.సి., బి.జడ్.సియస్., బి.కాం. (సి.ఎ), బి.ఏ. ఉర్దూ మీడియంతో సహా కళాశాలలో వివిధ నూతన కోర్సులను కూడా వచ్చే విద్య సంవత్సరంలో ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. అంతేకాకుండా దోస్త్ DOST ద్వారా ప్రవేశం పొందగోరు విద్యార్థులకు రిజిస్ట్రేషన్ కోసం కళాశాల పక్షాన ఉచితంగా సేవలు అందిస్తామని తెలిపారు.ఒక సారి తమ తల్లిదండ్రులతో కళాశాలను సందర్శించాల్సిందిగా కోరారు. కళాశాల దోస్త్ కోఆర్డినేటర్ డా.జి.చంద్రయ్య నేతృత్వంలో కళాశాల అధ్యాపకులు డా. వాసాల వరప్రసాద్, డా.సంగీత రాణి, జి.రామచంద్రం, డి.సుజాత, డా.వి.జమున. జి.నీరజ, డా.జి. శ్రీలత సంగీత ,నరేష్,లక్ష్మణ్ తదితరులు ప్రవేశ ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

