సీఐ కి మధ్యవర్తిగా ప్రభుత్వ ఉద్యోగి
నవగీతం, కరీంనగర్:
గతంలో వేములవాడ ప్రొహిబిషన్,ఎక్సైజ్ ఎస్హెచ్ఓ (SHO)గా పనిచేసిన ప్రస్తుత కరీంనగర్ అర్బన్ ఇన్స్పెక్టర్ గుండెటి రాము (AO-1) అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో రాముతో పాటు అతనికి సహకరించిన జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓబులాపూర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు జక్కని వేణు (AO-2)ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వేములవాడలో పనిచేసిన సమయంలో ఒక బెల్లం వ్యాపారి నుండి జక్కని వేణు ద్వారా రాము క్రమం తప్పకుండా లంచాలు వసూలు చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ అక్రమ లావాదేవీల కోసం 2022 నుండి 2024 వరకు డిజిటల్ యూపీఐ (UPI) మార్గాలను ఎంచుకోవడం గమనార్హం. ఉపాధ్యాయుడు వేణు తన వ్యక్తిగత ఎస్బీఐ మరియు యూబీఐ ఖాతాలను బినామీగా వాడుతూ, ఆ నగదును రాము మరియు అతని తండ్రి ఖాతాలకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఇన్స్పెక్టర్ రాము నివాసంలో జరిపిన సోదాల్లో లెక్కచూపని 20 లక్షల రూపాయల నగదును ఏసీబీ సీజ్ చేసింది. ప్రస్తుతం నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి కరీంనగర్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.ఈ కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.

