టిఆర్టిఎఫ్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బేతి సాయికృష్ణ
నవగీతం, జగిత్యాల
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో విద్యా రంగానికి చేసిన కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బేతి సాయికృష్ణ పేర్కొన్నారు.ప్రభుత్వం మొత్తం బడ్జెట్ వ్యయాన్ని రూ.3,24,234 కోట్లుగా చూపినప్పటికీ, విద్యారంగానికి కేటాయించిన రూ.26,674 కోట్లు మొత్తం బడ్జెట్లో కేవలం 8.23% మాత్రమేనని వారు స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ వాటా కేవలం 0.65% మేర మాత్రమే పెరిగిందని, ఇది విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా, ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ నివేదికను ప్రస్తావిస్తూ, బడ్జెట్లో కనీసం ఐదు శాతం కూడా పాఠశాలల అభివృద్ధికి నిధులు దొరకటం లేదని కమిషన్ ఎత్తి చూపిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 15% నిధులను విద్యాశాఖకు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ అరకొర నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్వహణ అసాధ్యమని వారు పేర్కొన్నారు. అదే విధంగా పెండింగులో ఉన్న పిఆర్సీ, ఎస్ఎస్ఏ, కెజిబివి ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రస్తావనే బడ్జెట్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యారంగానికి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 15 శాతానికి పెంచాలని డిమాండ్ చేసారు.

