వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బావి దగ్గర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి,డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నిరుపేద కుటుంబంలో జన్మించి కేంద్రమంత్రిగా, ఉప ప్రధానిగా దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని తెలిపారు.

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆనాటి ప్రభుత్వం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కూతురు మీరా కుమారికి స్పీకర్ పదవి ఇచ్చి సముచితంగా గౌరవించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. దేశానికి సేవలు అందించిన మహనీయులు విగ్రహాలు జిల్లా కేంద్రంలో ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. జిల్లాలో కూడళ్లు అభివృద్ధికి 10 కోట్లు మంజూరు చేశామని, అలాగే రహదారుల అభివృద్ధి కూడా జరుగుతుంది కాబట్టి దేశ ప్రజలకు సేవకులు అందించిన మహనీయుల విగ్రహాలు ఏర్పాటుకు కృషి చేస్తామని, విగ్రహాలు ఏర్పాటుకు ప్రతి ఒక్కరు సహకరించాలని అందరినీ కోరారు.

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ బీహార్ లోని చిన్న కుగ్రామంలో జన్మించిన డా బాబు జగ్జీవన్ రామ్ దేశానికి కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా తన అమూల్యమైన సేవలందించారని ఆయన సేవలను కొనియాడారు. స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్న గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని తెలిపారు. ప్రతి ఒక్కరూ కృషి, పట్టుదలతో సాధన చేస్తే విజయం సాధ్యమవుతుందని నిరూపించిన గొప్ప వ్యక్తి డా బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు మరియు సామాజిక న్యాయం కోసం డా బాబు జగ్జీవన్ రామ్ విశేషమైన కృషి చేశారని తెలిపారు.1971 ఇండియా పాకిస్థాన్ యుద్ద సమయంలో మన రక్షణశాఖ మంత్రిగా దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని తెలిపారు. నేటి తరాలకు డా. బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శమని యువత ఆయన బాటలో పయనించి అభివృద్ధిలో మన జిల్లాకు, రాష్ట్రానికి తద్వారా దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.అంతకుముందు వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ డా. బాబు జగ్జీవన్ రావ్ యొక్క గొప్పదనాన్ని వివరించడం జరిగింది.తదనంతరం డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి కె. రాజ్ కుమార్, జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కమిటి సభ్యులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.


