జగిత్యాలలో పండుగ వాతావరణం నెలకొల్పిన బీఆర్ఎస్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
భారీ జనసంద్రం అంచనా – లక్షల సంఖ్యలో హాజరు
జీవన్ రెడ్డి చేరికతో ఉత్సాహం రెట్టింపు
నవగీతం, హైదరాబాద్:

జగిత్యాల జిల్లాలో ఏప్రిల్ 20న నిర్వహించనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.సభప్రాంగణాన్ని స్వయంగా సందర్శించిన బీఆర్ఎస్వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులతో కలిని ఏర్పాట్లను సమీక్షించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగిత్యాల మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయిందని, ప్రజల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్రకు శ్రీకారం చుడతామని, ఇదే వేదిక నుంచి పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి సంకల్పం వ్యక్తం చేశారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ప్రజల ఆశీర్వాదాన్ని పొందేందుకు ఈ సభ కీలకమని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త దశ ప్రారంభమవుతోందని, రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించిన కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలను తీవ్రంగా విమర్శించారు.కేసీఆర్ సభకు ప్రజల దృష్టి వెళ్లకుండా చేయడానికి సమాంతర కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారని, మీడియా దృష్టిని మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, సభకు వచ్చే ప్రజలను అడ్డుకునే ఉద్దేశంతో రహదారులను తవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, చిన్నచూపు రాజకీయాలుగా అభివర్ణించిన కేటీఆర్, ఎంతటి అడ్డంకులు వచ్చినా సభ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కూడా జగిత్యాలలో కేసీఆర్ నిర్వహించిన సభలు చారిత్రాత్మకంగా నిలిచాయని, ఈ సభ కూడా అదే స్థాయిలో విజయవంతం అవుతుందని అన్నారు. సభకు లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మూడు లక్షల మంచినీటి బాటిల్స్, రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం వేళలోనే సభప్రారంభమయ్యేలా ప్రణాళికలు రూపొందించామని, ప్రజలు సౌకర్యంగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పార్టీ నాయకత్వం మొత్తం సమిష్టిగా పనిచేస్తోందని, ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించామ ని తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమన్ తదితర నాయకులు వివిధ ప్రాంతాల్లో సమన్వయం చేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని వివరించారు. జగిత్యాలను కేంద్రంగా తీసుకుని మొత్తం జిల్లా స్థాయిలో సమగ్ర ప్రణాళికతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక పార్టీకి మరింత బలం చేకూర్చిందని, ఆయన చేరికతో ప్రజల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో సభకు హాజరవుతారని, కేసీఆర్ ఏమి మాట్లాడతారో అన్న ఆసక్తి ప్రజల్లో కనిపిస్తోందన్నారు. కార్యకర్తలు, ప్రజలు శాంతియుతంగా, సంయమనంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జగిత్యాల ప్రజలు ఈ సభకు ఆతిథ్యమిస్తున్నారని, అందరూ కలిసికట్టుగా సహకరించాలని కోరారు. అవసరమైతే కార్యకర్తలు ముందుకు వచ్చి బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన చిన్నపాటి అవాంఛనీయ ఘటనలపై పాత్రికేయులకు క్షమాపణలు తెలియజేసిన కేటీఆర్, గాయపడిన వారికి పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం మీద ఈ సభను చారిత్రాత్మకంగా నిలబెట్టేందుకు పార్టీ శ్రేణులు అహర్నిశలు కృషి చేస్తున్నాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సుంకే రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, తుల ఉమ, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


