వార్డు కౌన్సిలర్ శిరీష శేఖర్ రెడ్డి వెల్లడి
నవగీతం కోరుట్ల ప్రతినిధి:
కోరుట్ల పట్టణంలోని 6వ వార్డులో ఉన్న స్మశాన వాటిక రూపురేఖలు మారుతున్నాయి. గత కొంతకాలంగా నిరాదరణకు గురై, అపరిశుభ్రతతో నిండిన స్మశాన వాటికను వార్డు కౌన్సిలర్ శిరీష శేఖర్ రెడ్డి పర్యవేక్షణలో శుభ్రం చేయించి
ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. బుధవారం స్మశాన వాటికలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలను,భారీ బండరాళ్లను యంత్రాల సహాయంతో తొలగించారు. అదేవిధంగా, గతంలో ఇక్కడున్న బోర్ మోటార్ పాడై నీటి సరఫరా నిలిచిపోవడంతో, అంత్యక్రియల సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని,వెంటనే 1.5 హెచ్ పి సామర్థ్యం గల కొత్త మోటార్‌ను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శిరీష శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో నాయకులు స్మశాన వాటిక అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు.

అసంపూర్తిగా పనులు వదిలేయడం వల్ల ఇది స్మశాన వాటికలా కాకుండా ఒక పాడుబడ్డ భవనంలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నామమాత్రపు పనులు చేసి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. స్మశాన వాటికలోని పెండింగ్ పనులు మరియు అభివృద్ధిపై తాము జువ్వాడి బ్రదర్స్ నర్సింగరావు, కృష్ణారావుల దృష్టికి తీసుకెళ్లినట్లు కౌన్సిలర్ తెలిపారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారని, సంబంధిత మంత్రితో మాట్లాడి స్మశాన వాటిక అభివృద్ధికి కావలసిన నిధులు మరియు నిలిచిపోయిన బిల్లుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. వార్డు అభివృద్ధికి అండగా నిలుస్తున్న జువ్వాడి సోదరులకు ఈ సందర్భంగా కౌన్సిలర్ శిరీష శేఖర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


