నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:
మెట్‌పల్లి మార్కెట్ యార్డులో అకాల వర్షం, గాలి దుమారంతో నష్టపోయిన రైతులను కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా తడిసిపోయిన వరి ధాన్యం, నష్టపోయిన మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంతో పాటు మొక్కజొన్న పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి రైతుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. “రైతు లేనిదే రాజ్యం లేదు” అనే నినాదాన్ని ఆచరణలో పెట్టి రైతు కుటుంబాల్లో మళ్లీ ఆనందం నింపాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మారుతి, మహదేవ్, చందు, ఆసిఫ్, నజీమ్ పాల్గొన్నారు. అలాగే నష్టపోయిన రైతులు బద్దం లక్షపతి రెడ్డి, మిట్టపల్లి పద్మ, లోగిరి దేవయ్య, గుద్దేటి శివకుమార్, ఆనంద్, లత, శ్రీనివాస్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

