నూతనంగా పునరుద్ధరించిన వాటర్ ఫౌంటెన్ ప్రారంభం
నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:
మెట్‌పల్లి పట్టణ సుందరీకరణలో భాగంగా స్థానిక పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద నూతనంగా పునరుద్ధరించిన వాటర్ ఫౌంటెన్‌ను మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ,వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ కౌన్సిలర్లతో కలిసి సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. పట్టణాన్ని అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఎంతో కాలంగా నిలిచిపోయిన శాస్త్రి చౌరస్తా ఫౌంటెన్‌ను ఆధునీకరించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.పట్టణ ప్రవేశంలోనే ఈ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పట్టణాన్ని మరిన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


