నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
మేడిపల్లి మండలం కల్వకోట గ్రామంలోని బడి బాట కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను గ్రామ సర్పంచ్ గుగ్గిల రమేష్ ఘనంగా సన్మానించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా అభినందించి శాలువాలతో సత్కరించారు.అనంతరం సర్పంచ్ గుగ్గిల రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. ఇకముందు కూడా పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించేలా కృషి చేయాలని విద్యార్థులను ప్రోత్సహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా యూనిఫామ్‌లు, నోట్‌బుక్స్, మార్నింగ్ స్నాక్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నందున గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని కల్వకోట గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, బొడ్డు నరేష్, న్యాయవాది సుధాకర్, వార్డు సభ్యులు నవీన్, సుమేరా, అనీష్, మోసిన్, పంచాయతీ కార్యదర్శి ఇళయచంద్ర, హైస్కూల్ మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

