విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం మానేయాలి
ఈనెల 18న దీక్ష చేపట్టి తీరుతాం
బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు చేయించిన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం స్థలం మంజూరు చేయించడం చేతకాకపోతే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు అయిన తర్వాత పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్థలం కేటాయించాలని కోరుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శాంతియుతంగా ఈనెల 18న జగిత్యాల తాసిల్ చౌరస్తా వద్ద ధర్మదీక్ష చేపట్టడానికి పూనుకుంటే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం దారుణం అన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తుండడం బాధాకరమన్నారు. ఇక్కడ ప్రశ్నించే గొంతును ముఖ్య ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.స్థలం కేటాయించకపోవడంతో ఇప్పటికే విద్యార్థులకు ఒక సంవత్సరం విద్య నష్టపోవడం జరిగిందని, వారి బాధను సైతం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పట్టించుకోకపోగా చులకన చేస్తూ మాట్లాడడం సరికాదన్నారు. శాంతియుతంగా ఆందోళన చేయడానికి వస్తే అధికార పార్టీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకొని మాపై దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మహిళా నేతలు సైతం అని చూడకుండా మానవత్వం మరిచిపోయి లాక్కుంటూ, దాడి చేస్తూ పోలీస్ స్టేషన్ తరలించడం సరికాదన్నారు. పోలీసుల తీరు చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది అనుమానంగా ఉందని పేర్కొన్నారు. జగిత్యాల ఒకప్పటి జైత్రయాత్ర సాగించిన, పోరాటాలు సాగించిన గడ్డాన్ని, అలాంటి గడ్డపై తాము చేస్తున్న పోరాటాన్ని ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారన్నారు. కొందరు స్థానికంగా ఉన్న నాయకుల చేతిలో జగిత్యాల నియోజకవర్గం నాశనమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు జరిగితే ఎంతోమంది పేద మధ్యతరగతి పిల్లలకు సీబీఎస్సీ వంటి నాణ్యమైన విద్య అందుతుందని, ఇప్పుడు తమను అడ్డుకున్న పోలీసుల పిల్లలకు సైతం ఈ విద్య అందుతుందని, అలాంటి పోలీసులకు సైతం ఇది అర్థం కాకపోవడం శోచనీయమన్నారు. ఎంతోమంది పోలీసు పెద్దల పిల్లలు బయటి దేశాల్లో ఇంటర్నేషనల్ వంటి విద్యను పొందుతున్నారని, మరి స్థానికంగా ఉన్న ఈ పోలీసు పిల్లలకు ఇలాంటి నాణ్యమైన విద్య అందకూడదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకే కాకుండా సుమారు 45 నుండి 50 శాతం వరకు పేద మధ్య తరగతి పిల్లలకు ఈ విద్య అందనుందని అన్నారు.ఇప్పటికైనా స్థానిక అధికార పార్టీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంజూరు చేయించిన కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు వెంటనే 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. పరికరాల స్థలం కేటాయించడం చేతకాకపోతే వెంటనే తన పదవికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా స్థలం కేటాయించకపోతే ఈనెల 18న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ధర్మదీక్ష చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతుకను ఎవరు ఆపలేరని, అన్ని వర్గాల ప్రజలు తమకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనుప్ రావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్, భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా మండల అధ్యక్షులు, పదాధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

