ఎంపీ అరవింద్ అన్న కృషితో రహదారుల అభివృద్ధికి నిధుల మంజూరు
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకుందని భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గ బాధ్యురాలు డాక్టర్ భోగ శ్రావణి తెలిపారు. ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు.
ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల జాతీయ రహదారి మరియు జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆమె వెల్లడించారు. వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా ఉత్తర తెలంగాణలో రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుందని తెలిపారు. ఇందుకు కృషిచేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.
ఈ రహదారుల విస్తరణతో జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు రవాణా సమయం తగ్గుతుందని ఆమె అన్నారు. రైతులు తమ పంటలను మార్కెట్లకు త్వరగా తరలించే అవకాశం కలుగుతుందని, వ్యాపార కార్యకలాపాలు వేగవంతమవుతాయని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ భోగ శ్రావణి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం మెరుగుపడటంతో ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతోందని చెప్పారు.
రహదారుల విస్తరణతో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు పెరిగి యువతకు ఉపాధి లభిస్తుందని, పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టులు మైలురాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రతి ప్రాంతానికి సమాన అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు చేపడుతోందని డాక్టర్ భోగ శ్రావణి తెలిపారు. ఈ జాతీయ రహదారుల విస్తరణ తెలంగాణ ఆర్థిక ప్రగతికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఎంతో దోహదపడుతుందని ఆమె అన్నారు.

