Monday, August 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలసమిష్టి కృషితోనే మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యం

సమిష్టి కృషితోనే మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యం

📰 Generate e-Paper Clip

“అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం”సందర్భంగా యాంటీ డ్రగ్స్ 3K రన్ నిర్వహణ

3కె రన్‌కు జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ అశోక్ కుమార్, ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్

నవగీతం(జగిత్యాల ప్రతినిధి)

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్  జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో గురువారం యాంటీ డ్రగ్స్ 3కె రన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,, జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్, జిల్లా అధికారులు, వైద్యులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వివేకానంద స్టేడియం (ఓల్డ్ బస్ స్టాండ్) నుంచి ప్రారంభమైన 3కె రన్‌ను జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.టవర్ సర్కిల్, న్యూ బస్ స్టాండ్ మీదుగా ఐఎంఏ హాల్ వరకు కొనసాగిన ఈ రన్‌లో వందలాది మంది యువత ఉత్సాహంగా పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలనపై తమ వంతుపాత్ర నిర్వహిస్తామని అన్నారు.    

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తును కూడా దెబ్బతీసే అత్యంత ప్రమాదకరమైన వ్యసనమని అన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి విద్య, క్రీడలు, ఉపాధి, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో డ్రగ్స్ విక్రయం, రవాణా, వినియోగంపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.

జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు సమిష్టిగా పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ “డ్రగ్స్‌కు నో చెప్పుదాం – ఆరోగ్యవంతమైన, సురక్షితమైన సమాజాన్ని నిర్మిద్దాం” అనే నినాదంతో ప్రతిజ్ఞ చేశారు.అనంతరం 3K రన్‌లో విజేతలుగా నిలిచిన యువతకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ సామిండ్ల వాణి శ్రీనివాస్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, టౌన్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, ఐఎంఏ జగిత్యాల అధ్యక్షులు డా. గుడూరి హేమంత్, కార్యదర్శి డా. ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి డా. కోటగిరి సుధీర్ కుమార్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular