విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నిర్లక్ష్యం.. గ్రామస్థుల్లో ఆందోళన
నవగీతం, ఆగస్టు2,ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామ విద్యుత్ సరఫరాకు కీలకమైన వర్షకొండ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆదివారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. విధుల్లో ఉన్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి డ్యూటీ సమయంలోనే మద్యం మత్తులో కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.సమాచారం ప్రకారం, సబ్‌స్టేషన్‌లోని కుర్చీలో కూర్చొని మద్యం సేవిస్తున్నట్లు కనిపించిన ఉద్యోగికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టేబుల్‌పై మద్యం గ్లాస్ కూడా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ సరఫరా వంటి అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వహించాల్సిన ఉద్యోగి విధి నిర్వహణను విస్మరించి మద్యం మత్తులో ఉండడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సబ్‌స్టేషన్‌లో శాశ్వత ఆపరేటర్ల కొరత కారణంగా తాత్కాలికంగా కాంట్రాక్ట్ ఉద్యోగులతో విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి సున్నితమైన కేంద్రంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించినా భారీ నష్టం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వేలాది మంది ప్రజలకు విద్యుత్ సరఫరా చేసే ఉపకేంద్రంలో ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించరాదని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి, బాధ్యుడైన ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.


