Thursday, April 16, 2026
ads
Homeఖమ్మంఫుట్ పాత్ ల నిర్మాణం నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలి: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఫుట్ పాత్ ల నిర్మాణం నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలి: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

📰 Generate e-Paper Clip

నవగీతం,ఖమ్మం :

ఖమ్మం నగరంలో ఆధునిక మౌళిక వసతులతో పాటు ప్రజలకు నడకలో సౌకర్యం, ఆర్యోగం, భద్రత కల్పించే విధంగా ఫుట్ పాత్ ల నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీలు చేశారు. ఎస్ఆర్ &బీజిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతం నుండి చేపట్టనున్న ఫుట్‌పాత్ పై వినూత్నంగా గ్రానైట్ రాళ్లతో ఏర్పాటు చేసే పనులను, టైల్స్ డిజైన్‌ అకృతులను కలెక్టర్ పరిశీలించారు. ఫుట్‌పాత్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఫుట్‌పాత్‌లు ప్రజలకు సౌకర్యవంతంగా,భద్రతతో ఉండేలా నిర్మించాలని, చిన్న పిల్లలు, వికలాంగులు,వృద్ధులు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచే విధంగా పనులు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ నగర అభివృద్ధి అనేది కేవలం రోడ్లు, భవనాల నిర్మాణంతోనే కాకుండా ప్రజల రోజువారీ జీవితాన్ని సులభతరం చేసే మౌళిక వసతులతో ముడిపడి ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఫుట్‌పాత్‌లు నడక ద్వారా ప్రజల భద్రతకు, ఆరోగ్యానికి అత్యంత కీలకమని అన్నారు.విద్యార్థులు, ప్రజలు నడుచుకుంటూ వెళ్లే పరిస్థితులు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫుట్‌పాత్‌లు అత్యంత నాణ్యతతో, సౌకర్యవంతంగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడా నాణ్యతలో రాజీ పడకుండా పనులు జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.నగరంలో తొలిసారిగా వినూత్నంగా గ్రానైట్ రాళ్లతో ఫుట్‌పాత్‌లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. లైట్ గ్రే రంగులో గ్రానైట్ రాళ్లు ఉపయోగించడం వలన ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వర్షం, ఎండ వంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా, దీర్ఘకాలికంగా నిలిచి ఉపయోగపడతాయని అన్నారు. దివ్యాంగులు, వృద్ధులు సులభంగా నడిచేలా స్లోప్‌లు, ఎడ్జ్‌లు సరిగ్గా రూపకల్పన చేయాలని, ప్రజలకు వెలుతురు వలన ఏలాంటి ఇబ్బందులు కలగకుండా, రాత్రి వేళ అసౌకర్యం లేకుండా లైటింగ్ పోల్స్ ఏర్పాటు చేయాలన్నారు. నగరం అంతా ఒకే విధమైన డిజైన్‌తో గ్రానైట్ ఫుట్‌పాత్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నగరంలో ఫుట్‌పాత్‌ల అభివృద్ధి వల్ల ప్రజలు నడక వైపు మొగ్గు చూపుతారని, దీని ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, వాహనాలపై ఆధారపడకుండా నడకకు అనుకూలమైన మౌళిక వసతులు కల్పించడం ద్వారా కాలుష్యం కూడా తగ్గుతుందని కలెక్టర్ తెలిపారు. జరుగుతున్న నిర్మాణ అభివృద్ధి పనుల అమలులో ఎక్కడా నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా పూర్తి బాధ్యతతో పర్యవేక్షణ చేస్తూ పనులు పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎఈ యాకుబ్ అలీ, ఖమ్మం గ్రానైట్ యాజమాన్యాలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular