నవగీతం, హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 2026–27 రాష్ట్ర బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించాలని తెలంగాణ గల్ఫ్ వలస కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది కార్మికులు గల్ఫ్ తదితర దేశాల్లో పనిచేస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, గత రెండు సంవత్సరాలుగా వారి సంక్షేమానికి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు లేవని సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
టీపీసీసీ అధ్యక్షుల, ఎమ్మెల్సీ బి. మహేష్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీలు తక్కల్లపెల్లి రవీందర్ రావు, ఎల్. రమణ, బీజేపీ ఎమ్మెల్యేలు కె. వెంకటరమణ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి లను ఆదివారం గల్ఫ్ సంఘాల ప్రతినిధులు కలిసి వినతి పత్రాలు సమర్పించారు.
గల్ఫ్ సంఘాల ప్రతినిధులు ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర నాయకులు మంద భీంరెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, తోట ధర్మేంద్ర, , గజ్జెల అశోక్, చిట్ల మధు, తోట రమేష్, రేణుక సయోల, మోత్కూరి నవీన్ గౌడ్, కొక్కుల నవీన్ నేత, సయ్యద్ మహబూబ్ ఉన్నారు.
ఎన్నారై శాఖకు ప్రత్యేక మంత్రి నియమించడంతో పాటు, సమగ్ర ఎన్నారై పాలసీతో గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరాయి. విదేశాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో మృతి చెందిన వారికీ ఇదే ప్రయోజనం వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశాయి.
గల్ఫ్ కార్మికుల పిల్లల విద్య, మానసిక–సామాజిక సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించాయి. అలాగే ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ను బలోపేతం చేయడం, ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడం, నైపుణ్య శిక్షణ, పునరావాసం, అక్రమ రిక్రూట్మెంట్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి.
ప్రతి సంవత్సరం ‘ప్రవాసి తెలంగాణ దివస్’ నిర్వహించాలని, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా సేవలందించిన పి. శివ శంకర్ జన్మదినం ఆగస్టు 10న దీనిని అధికారికంగా జరపాలని కోరారు. అలాగే ప్రవాసుల కోసం పీవీ ప్రవాసీ భవన్ ఏర్పాటు చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రవాసి బీమా యోజన విస్తరణ, హైదరాబాద్ లో సౌదీ, కువైట్ కాన్సులేట్ల ఏర్పాటు, వలస కార్మికుల హక్కులను కాపాడేలా కొత్త చట్టంలో మార్పులు చేయాలని కూడా కోరినట్లు సంఘాలు తెలిపాయి.

