నవగీతం,జగిత్యాల:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నల్లగొండ ప్రాచీన శ్రీ లక్ష్మీనృసింహస్వామి స్వయంభూ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు కంజర్ల శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా సాగింది. ముందుగా ఆలయ పండితులు, అధికారులు స్వామివారిని ఆలయ బయటనున్న కమాన్ నుండి కళ్యాణ ప్రాంగణం వరకు ఉత్సాహభరితంగా ఎదుర్కొలు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కళ్యాణ వేదికపై భక్తుల గోవింద నామస్మరణల నడుమ అర్చక పండితులు స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కళ్యాణోత్సవంలో భాగంగా మాలధారణ,పూబంతులాట వంటి కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల విశిష్టతను వివరిస్తూ పౌర్ణమి రోజైన ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.కళ్యాణ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే నాయకులు ఊట్కూరి నరేందర్ రెడ్డి, నాయకురాలు దండు రాజేశ్వరి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో ఉడుత వెంకన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, అర్చక పండితులు, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


