Tuesday, April 14, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలకేంద్ర బడ్జెట్ 2026-27: విద్యా రంగం, వేతన జీవుల ఆశలు నెరవేరలేదు -టిఆర్టిఎఫ్.

కేంద్ర బడ్జెట్ 2026-27: విద్యా రంగం, వేతన జీవుల ఆశలు నెరవేరలేదు -టిఆర్టిఎఫ్.

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల:

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ విద్యా రంగం మరియు మధ్యతరగతి వేతన జీవుల ఆశలను ప్రతిబింబించలేకపోయిందని తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బేతి సాయికృష్ణ అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానానికి, విదేశీ పెట్టుబడులకు బడ్జెట్‌లో పెద్దపీట వేయడం శుభపరిణామమే అయినప్పటికీ, దేశ భవిష్యత్తుకు పునాదులైన ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి మరియు నిరంతరం పన్నులు చెల్లించే ఉద్యోగుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత లభించకపోవడం  నిరాశ కలిగించిందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఏఐ (AI), డిజిటల్ విజ్ఞాన కేంద్రాల వంటి ఆధునిక పోకడలను ఆహ్వానిస్తూనే, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మరియు ఉపాధ్యాయ నియామకాల వంటి కీలక అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సి ఉందని వారు సూచించారు. విద్యారంగానికి జిడిపిలో 6% నిధుల కేటాయింపు అనే చిరకాల వాంఛ ఈసారి కూడా నెరవేరలేదని వారు పేర్కొన్నారు. ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులు ఆశించిన ఊరట లభించకపోవడం, వారి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని వివరించారు. ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న నిత్యావసరాల ధరల దృష్ట్యా ఆదాయ పన్ను స్లాబ్ రేట్లలో సానుకూల మార్పులు వస్తాయని, స్టాండర్డ్ డిడక్షన్ పెరుగుతుందని లక్షలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆశగా ఎదురుచూశారని వారు తెలిపారు. అయితే కొత్త పన్ను చట్టం 2025లో కేవలం సాంకేతిక మార్పులకే పరిమితం కాకుండా, ఉద్యోగుల కొనుగోలు శక్తిని పెంచేలా ప్రత్యక్ష పన్ను రాయితీలు ఇచ్చి ఉంటే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. విద్యారంగంలో డిజిటలైజేషన్ సత్ఫలితాలు సామాన్య విద్యార్థులకు అందేలా ప్రణాళికలు రూపొందించాలని  వేతన జీవుల పన్ను భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని బేతి సాయికృష్ణ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular