శాస్త్రోక్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
నవగీతం, హైదరాబాద్:
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా సాయంత్రం 6 :30 నుండి రాత్రి 8 :30 వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు మంగళవారం ధ్వజారోహణంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.00 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి అని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర టెంపుల్ లోకల్ అడ్వైసరీ కమిటీ ప్రెసిడెంట్ ఏ. వేంకటేశ్వరా రెడ్డి, హైదరాబాద్ టీటీడీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యూ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ నిరంజన్, హరికృష్ణ, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

