Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణమంచిర్యాలసీసీఐ పత్తి కొనుగోలు గడువును పొడిగించాలి

సీసీఐ పత్తి కొనుగోలు గడువును పొడిగించాలి

📰 Generate e-Paper Clip

నాయిబ్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

నవగీతం,మంచిర్యాల

మంచిర్యాల జిల్లాలో అధిక వర్షాల కారణంగా పత్తి పంట నష్టపోయి కోలుకోలేక పోతున్న రైతులను ఆదుకునేందుకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు గడువును వెంటనే పొడిగించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాంటెంకి డిమాండ్ చేశారు. శనివారం నెన్నెల మండల కేంద్రంలో నాయిబ్ తహసీల్దార్ ప్రకాష్‌కు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నదని,దిగుబడి తగ్గడంతో పాటు కూలీల కొరత వల్ల పత్తి ఏరడం ఆలస్యమైందని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సీసీఐ కొనుగోలు గడువు ఈ నెల 20వ తేదీతో ముగియడం రైతులకు గొడ్డలిపెట్టుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఒకవేళ సీసీఐ కేంద్రాలను మూసివేస్తే, రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని, దీనివల్ల క్వింటాల్‌కు సుమారు రూ.2,000 వరకు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు గడువును పొడిగించి రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఆర్పీ మండల అధ్యక్షులు తాళ్ల మహేష్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు సాయి గౌడ్, మారయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular