నవగీతం,మెట్ పల్లి :
మెట్ పల్లి మండలం మేడిపల్లి గ్రామం శుక్రవారం జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం గ్రామంలోని సీతారాముల ఉత్సవ విగ్రహాలను అత్యంత వైభవంగా, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఊరేగింపుగా తరలించారు.భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో గ్రామ పురవీధుల గుండా మేళతాళాలతో సాగిన ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలకగా, ఆంజనేయ స్వామి మాల వేసుకున్న భక్తులు సందడి చేశారు. జై శ్రీరామ్ అనే నినాదాలతో మేడిపల్లి వీధులన్నీ మారుమోగిపోయాయి. గ్రామం నుండి ఆలయం వరకు సాగిన ఈ శోభాయాత్ర ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. రామలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న ఉత్సవ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరగనుంది. ఈ జాతర కోసం ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, అన్నప్రసాదం, చలువ పందిర్లు వేసి సకల సౌకర్యాలను కల్పించారు.ప్రతి ఏటా నిర్వహించే ఈ జాతర గ్రామానికి ఒక పెద్ద పండుగ. స్వామివారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లడంతో ఉత్సవ సంబరాలు అధికారికంగా మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


