నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో మండలానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నేత పిడుగు ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు సుమారు 120 మంది అనుచరులు కూడా రాజీనామా చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా పిడుగు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిపించేందుకు తాము రాత్రింబవళ్లు శ్రమించి, ఏమి ఆశించకుండా. స్వంత ఖర్చులతో పనిచేశామని, కానీ గెలిచిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.తాను ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎమ్మెల్యేను సంప్రదించలేదని, ప్రజల సమస్యలు, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల న్యాయం కోసమే అడిగానని తెలిపారు.అయినప్పటికీ, పార్టీలో శ్రమించిన వారిని పక్కనబెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.సర్పంచ్ ఎన్నికల సమయంలో కూడా తనకు వ్యతిరేకంగా వ్యవహరించి ఓటమికి కారణమయ్యారని అన్నారు.పద్మశాలి పూడూరు ఖాదీ బోర్డు భూమి వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, చేనేత కార్మికులకు న్యాయం చేస్తానని ఇచ్చిన హామీని ఎమ్మెల్యే అమలు చేయలేదని, ప్రస్తుతం అదే వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని అనుసరించి మారే వారికి ప్రాధాన్యం ఇస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. తదుపరి తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.ఇదే సమావేశంలో గడ్డం చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, తాము గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి, అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు. పార్టీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ చేపట్టిన జోడో పాదయాత్రలో పాల్గొని, పార్టీ బలోపేతానికి కృషి చేశామని చెప్పారు.చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి తాము కీలకంగా పనిచేశామని పేర్కొన్నారు.అయితే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.డీఎంఎఫ్టీ నిధుల వినియోగం, ఏఎంసీ కమిటీ నియామకాలు, కొండగట్టు దేవాలయ డైరెక్టర్ పదవులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ వంటి అంశాల్లో పారదర్శకత లోపించిందని ఆరోపించారు.ఇటీవల మార్కెట్. ఏఎంసీ వైస్ చైర్మన్గా నియామకంలో కూడా రైతులకు ప్రాధాన్యం ఇవ్వలేదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతు కుటుంబాలకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు.అలాగే, చెక్కుల దుర్వినియోగంపై కూడా ఎమ్మెల్యే స్పందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా తాము పార్టీకి రాజీనామా చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సుమారు వంద ఇరవై మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

