భక్తుల ఫిర్యాదు లేఖలు కలకలం
నవగీతం,కొడిమ్యాల
మల్యాల మండలంలోని కొండగట్టు దేవస్థానం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు శుక్రవారం నిర్వహించారు.లలితా సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ లెక్కింపులో గత 17 రోజుల్లో మొత్తం రూ.75,02,126 నగదు సమకూరినట్లు ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు.హుండీ లెక్కింపు సందర్భంగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భక్తులు నగదు, కానుకలతో పాటు తమ సమస్యలను వివరించిన ఫిర్యాదు లేఖలను కూడా హుండీలో వేయడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ లేఖల్లో ఆలయ పరిసరాల్లో ప్రాథమిక సదుపాయాల లేమిపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ముఖ్యంగా కోనేరులో నీరు అపరిశుభ్రంగా ఉందని, టాయిలెట్ల పరిస్థితి దారుణంగా ఉందని, త్రాగునీటి సదుపాయం సరిగా లేదని పేర్కొన్నారు.భక్తులకు అవసరమైన మౌలిక వసతులు తగిన స్థాయిలో లేవని వాపోయారు.సమస్యలను తక్షణమే పరిష్కరించి సదుపాయాలను మెరుగుపరచాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో హుండీలో విరాళాలు ఇవ్వబోమని హెచ్చరించారు. స్థానిక ఆలయాల అభివృద్ధికే తమ సహకారం పరిమితం చేస్తామని లేఖల్లో స్పష్టం చేశారు.ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవదాయ శాఖ జగిత్యాల డివిజన్ పరిశీలకులు రాజామౌళి, ఏఈవో హరిహరనాథ్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, కపిందర్, ఏఎస్ఐ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.


