నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం: మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత
మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు: కమిషనర్ రవీందర్
నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై కనీస అవగాహన కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణాలను కాపాడుకోవచ్చని మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కోరుట్ల పట్టణంలో సోమవారం రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్‌తో పాటు సబ్ ఇన్‌స్పెక్టర్ చిరంజీవి, డి.ఎం.హెచ్.ఓ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. వాహనదారులు నిర్లక్ష్యాన్ని వీడి ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాల బారిన పడేయవద్దని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణ రక్షణకు కవచంలా పనిచేస్తుందని సూచించారు. ఎస్‌ఐ చిరంజీవి మాట్లాడుతూ.. అతివేగం, అజాగ్రత్త వల్లే నేడు అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం డి.ఎం.హెచ్.ఓ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు అందించాల్సిన ప్రథమ చికిత్స ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణ నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


