పారిశుధ్య కార్మికురాలికి ఆర్థిక సాయం
నవగీతం,మెట్‌పల్లి ప్రతినిధి :
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని 6వ వార్డులో విధి నిర్వహణలో ఉన్న పారిశుధ్య కార్మికురాలు స్వప్నపై గురువారం ఉదయం వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ హఠాత్పరిణామంలో ఆమె ముఖం మరియు కాలిపై తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు మరియు తోటి కార్మికులు తక్షణమే స్పందించి ఆమెకు అండగా నిలిచారు.గాయపడి చికిత్స పొందుతున్న స్వప్నను పరామర్శించి,ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం కార్మిక సంఘం తరపున ఆర్థిక సాయాన్ని అందజేశారు.కష్టాల్లో ఉన్న తోటి కార్మికురాలికి మేమున్నామంటూ భరోసా కల్పించారు.ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షులు లంక శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికుల రక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఆపదలో ఉన్న కార్మికులను ఆదుకోవడంలో సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు లంక శ్రీకాంత్, బర్ల లక్ష్మణ్,ఉల్లెందుల శీను,లోకిని గంగా పోచయ్య, మరియు సానిటరీ జవాన్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

