నవగీతం,జగిత్యాల ప్రతినిధి :
జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఫిర్యాదులను పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 13 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ప్రతి ఫిర్యాదుపై న్యాయపరంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. చట్ట పరిధిలోకి వచ్చే సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, విచారణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వినతులను స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే స్పందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

