నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మే 15, 2026 నుండి జూన్ 15, 2026 వరకు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జనరల్ సెక్రటరీ మరియు ముఖ్య కార్యనిర్వాహణాధికారి డాక్టర్ ఏ. రాములు తెలిపారు. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర గవర్నర్ మరియు అధ్యక్షులు శివ ప్రతాప్ శుక్లా మార్గదర్శకత్వంలో, రాష్ట్ర చైర్మన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ నాయకత్వంలో సమాజానికి అనేక సేవలను అందిస్తున్నదని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు సహాయం చేయడం, స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వహణ, ప్రమాద బాధితులకు అత్యవసర రక్తం అందించడం, క్యాన్సర్, సికిల్ సెల్, తలసేమియా రోగులకు రక్తసహాయం చేయడం వంటి సేవలను రెడ్ క్రాస్ సంస్థ అందిస్తోందన్నారు. అలాగే ఉచిత వైద్య శిబిరాలు, క్యాన్సర్ మరియు తలసేమియా ముందస్తు నిర్ధారణ పరీక్షలు, సీనియర్ సిటిజన్ హోంలు, అనాథ పిల్లల ఆశ్రమాలు, హోమ్ నర్సింగ్ సేవలు, రక్తనిధి కేంద్రాలు, ఉచిత ప్రసూతి వైద్యశాలలు, ప్రకృతి చికిత్స వైద్యశాలలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రథమ చికిత్స మరియు సీపీఆర్ శిక్షణ శిబిరాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నదని చెప్పారు. యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ విభాగాల ద్వారా విద్యార్థుల్లో సామాజిక సేవా భావన పెంపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 47 వేల మంది సభ్యులతో దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా రెడ్ క్రాస్ కొనసాగుతోందన్నారు. ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రముఖ సామాజిక వ్యక్తుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు రెడ్ క్రాస్ సభ్యత్వానికి అర్హుడని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదుకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి లేదా పాన్ కార్డు అవసరమని తెలిపారు. జిల్లాల వారీగా జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ లేదా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను నోడల్ అధికారులుగా నియమించినట్లు చెప్పారు. సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక డాటా సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లా అదనపు కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిరంతరం సమీక్షిస్తారని తెలిపారు. ప్రజలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వెబ్సైట్ మరియు తెలంగాణ రెడ్ క్రాస్ మొబైల్ యాప్ ద్వారా జీవిత, వైస్ ప్యాట్రన్, ప్యాట్రన్ సభ్యులుగా చేరి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.

