నవగీతం, ఆలేరు ప్రతినిధి :
జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి భావోద్వేగ కవితను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ పిలుపు ప్రతి గుండెల్లో మంటలు రేపిందని, తెలంగాణ సాధన ఆకాంక్ష పల్లె పల్లెకు విస్తరించి ప్రజా ఉద్యమంగా మారిందని ఆమె పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, మిలియన్ మార్చ్ వంటి ఉద్యమ ఘట్టాలు ఢిల్లీని కదిలించాయని, ట్యాంక్‌బండ్‌పై కురిసిన త్యాగాల తుఫాను అణచివేత గోడలను కూల్చివేసిందని ఆమె అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వీధుల్లో మారుమోగిన తెలంగాణ గర్జన ఉద్యమానికి ఊపిరిగా నిలిచిందని తెలిపారు.అమరవీరుల ఆశయాలు తెలంగాణ ప్రజలకు మార్గదర్శకమని, వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. త్యాగధనుల ఆశయాలకు తలవంచి బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, “జై తెలంగాణ” నినాదంతో రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేద్దామని మంజుల పత్తిపాటి ఆకాంక్ష వ్యక్తం చేశారు.

