మేడా శంకరయ్య – సుశీలమ్మ ట్రస్ట్ సేవలు భేష్
ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్
నవగీతం, వైరా:
వైరా మండలంలోని విప్పలమడకను మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. విప్పలమడక గ్రామాన్ని తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. అందుకోసం ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. విప్పలమడక గ్రామంలోని గ్రామపంచాయితీ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం మహిళా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మేడా హేమిమా చక్రపాణి మాట్లాడుతూ విప్పలమడక గ్రామాన్ని ఎమ్మెల్యే దత్తత తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా గ్రామంలో సైడ్ డ్రైన్లు నిర్మించాలని , పొలాలకు వెళ్లే రహదారులను మెటల్ రోడ్లుగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేని కోరారు. వీటితో పాటు అనేక సమస్యలు పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దింతో స్పందించిన ఎమ్మెల్యే విప్పలమడక అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మేడా శంకరయ్య – సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ కార్యాలయానికి రూ. 65 వేలు విలువ చేసే రెయిన్ ప్రూఫ్ టెంట్, 100 కుర్చీలను ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేశారు. మేడా శంకరయ్య – సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు రూ. 3.50 లక్షలతో గ్రామంలో సామాజిక సేవలు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ట్రస్ట్ సేవలు భేష్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి,ఎంపీడీవో సక్రియ, తహసిల్దార్ సురేష్ బాబు, గ్రామ సర్పంచ్ మేడా హేమీమా చక్రపాణి, ఉప సర్పంచ్ బూర్గు లూర్దమ్మ, మాజీ సర్పంచులు పారుపల్లి కృష్ణారావు, తుమ్మల జాన్ పాపయ్య, మాజీ ఎంపీటీసీ ఆకుల ప్రసాద్, మాజీ ఉప సర్పంచ్ లు కొల్లికొండ వీరభద్రరావు, వీరపనేని చెన్నకేశవులు, గ్రామ కార్యదర్శి కాంపెల్లి ధనమ్మ, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

