నవగీతం,కొడిమ్యాల:
కొడిమ్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కొడిమ్యాల మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు మాట్లాడుతూ కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలవడం పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యేనని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.సుదీర్ఘ పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహోన్నత నాయకుడిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు.ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

