టీఆర్ఎస్ తో ప్రజలకు అమ్మనై పాలన అందిస్తా.
కేసీఆర్ ఆత్మలేని మరబొమ్మ.. ఆయన గుంటనక్కలు, తోడేళ్ల చేతిలో బందీ అయ్యాడు.
పసుపు,నీలం, ఆకుపచ్చ రంగుల్లో పార్టీ జెండా.
నవగీతం, హైదరాబాద్:
అమ్మనై తెలంగాణ ప్రజలకు పరిపాలన అందిస్తానని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం (అద్వయ కన్వెన్షన్)లో శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీని ప్రకటించారు. కర్కోటక, రాక్షస రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమేసేందుకు టీఆర్ఎస్ పాంచజన్యాన్ని పూరిస్తున్నానని అన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల కోలాహలం మధ్య పార్టీ పేరును ప్రకటించారు. తన కోసం తరలివచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం అనే పంచ సూత్రాలే ఇరుసుగా తమ పార్టీ పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఈ ఐదు రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తామని.. రెండున్నరేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి ఆయా సమస్యలకు పరిష్కారం చూపిస్తానని తెలిపారు. ఉద్యమకాలంలో ప్రజల కోసం పరితపించిన కేసీఆర్ ఇప్పుడు గుంటనక్కలు, తోడేళ్ల చేతిలో బంది అయ్యారని.. ఆయన మన కేసీఆర్ కాదు మరబొమ్మ అన్నారు. తెలంగాణాకు ఏదైనా జరిగితే ప్రాణం పెట్టి పని చేసే పార్టీ కావాలని అందుకోసమే తాను టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు.

రేవంత్ రెడ్డి కర్కోటకుడు.. నియంత
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…కర్కోటక, నియంత సీఎం అని మండిపడ్డారు. వెలుగుమట్లలో అన్ని పర్మిషన్లు ఉన్న సరే అక్కడి ప్రజల ఇళ్లను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతో ఒక గర్భిణీకి అబార్షన్ అయితే ఆమె తండ్రి రోదన కళ్ల ముందు ఇంకా మెదులుతుందని చెప్పారు. రెండు నెలల చిన్నారిని కాళ్లతో తన్ని చంపితే ఇప్పటికీ కూడా కేసు పెట్టలేదన్నారు. గురుకులాల్లో విషం పెట్టి విద్యార్థులను చంపుతుంటే ఈ ప్రభుత్వం స్పందించటం లేదని విమర్శించారు. కర్ల రాజేష్ అనే యువకుడిని లాకప్ డెత్ చేస్తే ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే ఈ ముఖ్యమంత్రిని కర్కోటక, నియంత ముఖ్యమంత్రి అంటున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడున్న మూడు పార్టీలు కుటుంబ పాలన, అవినీతి, బంధుప్రీతితో నిండిపోయాయని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయటం కాంగ్రెస్ అజెండా అయితే పెద్ద సార్ ఫామ్ హౌస్ లో ఉండి…చిన్న సార్ ను సీఎం చేయాలన్నది బీఆర్ఎస్ అజెండా అని చెప్పారు. ఇక సామాజిక న్యాయాన్ని ఖతం పట్టించటమే బీజేపీ సింగిల్ అజెండా అని కవిత అన్నారు. ఈ మూడు పార్టీల మీద అలుపెరగని పోరాటం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సేన సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అమ్మగా పరిపాలన అందిస్తా
తెలంగాణలో 3.50 కోట్ల మంది ప్రజలకు అమ్మనై పరిపాలన అందిస్తానని కవిత చెప్పారు. అమ్మతనంతో పాలన చేస్తేనే బిడ్డల కష్టం తెలుస్తుందన్నారు. తెలంగాణలో ఏళ్ల తరబడి నడిచిన భూస్వామ్య వ్యవస్థపై ఎందరో మహానుభవులు పోరాడితేనే సమానత్వం వచ్చిందన్నారు. మలిదశలో కేసీఆర్, ఉద్యమకారులు పోరాడితే కొత్త రాష్ట్రం వచ్చిందన్నారు. ఇప్పుడు తాము రాజకీయ శక్తితో పాటు ప్రజా పోరాటాలను మిళితం చేసి సామాజిక తెలంగాణ సాధిస్తామని చెప్పారు. తల్లి జేబు చూడదని, కడుపు చూస్తుందని కవిత చెప్పారు. కచ్చితంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉంటామని… మరో రెండేళ్లలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పాంచజన్యం పేరుతో ఐదు హామీలు
తెలంగాణ రాష్ట్ర సేన అజెండాను కవిత వివరించారు. పాంచజన్యం పేరుతో ఐదు అంశాలపై హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి, సామాజిక న్యాయం అనే అంశాలపై దృష్టి పెడతామని ప్రకటించారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చదివిన కూడా ప్రజలపై రూపాయి భారం పడనివ్వమని చెప్పారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్యకైనా కార్పొరేట్ వైద్యం చేయించుకున్న సరే ప్రజలకు ఆ వైద్యాన్ని ఉచితంగానే అందించే బాధ్యత తనదని కవిత స్పష్టం చేశారు. ఇక రైతు సంక్షేమం అంటే రైతుకు గౌరవం వచ్చేలా కృషి చేయటమేనన్నారు. తాము రైతులమని గర్వంగా చెప్పుకునేలా చేస్తామన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, యూరియ సహా రైతు సంక్షేమానికి చేయాల్సివన్నీ చేస్తామని స్పష్టం చేశారు. రైతును రాజు చేయటమే లక్ష్యమన్నారు. ఇక ఉపాధి విషయంలోనూ తమకు స్పష్టమైన విజన్ ఉందని కవిత చెప్పారు. యువతకు ఉపాధి అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదన్నారు. వారి వద్ద మంచి వ్యాపార ఆలోచన ఉంటే 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు ప్రభుత్వమే రుణం అందించి వారిని ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. అదే విధంగా తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఒకటే నోటిఫికేషన్ లో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు తమ యవ్వనాన్ని ఉద్యమంలో కోల్పోయారని చెప్పారు. వారి కోసం జూన్ 2, 2014 ను కటాఫ్ తేదీగా నిర్ణయిస్తూ లక్ష సూపర్ న్యూమరీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇక సామాజిక న్యాయం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. హిందీలో తియ్యగా మాట్లాడి బీఆర్ఎస్, కాంగ్రెస్ లు మైనార్టీలను మోసం చేశాయని కవిత చెప్పారు. మైనార్టీలతో పాటు అన్ని వర్గాలకు రాజకీయ అధికారం కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. మహిళ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వటంతో పాటు చిరు ఉద్యోగులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు.

కేసీఆర్ పాలనలో దారి తప్పిన తెలంగాణ రథ చక్రం
తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రథ చక్రం దారి తప్పిందని కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆర్తిని అర్థం చేసుకోవటంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు. సామాజిక తెలంగాణ రథ చక్రం పూర్తిగా విరిగి ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో అవి నిజం కాలేదన్నారు. తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు పోతాయని భావిస్తే…రైతులకు బేడీలు వేశారన్నారు. ఇసుక దందా మీద ప్రేమతో దళితుల మీద లాఠీలు విరిగాయని గుర్తు చేశారు. ఫోన్లు ఎక్కడ వింటారోనని వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా బతకాల్సి వచ్చిందని…దారుణమైన నిఘా నీడలో తెలంగాణ అంతా బతికిందని చెప్పారు. ఆనాడు తెలంగాణ కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్నారు. ఉద్యమకారులు ఒక హోదా మాత్రమే కోరుకున్నారని…పదేళ్లు అధికారంలో ఉండి కనీసం వారికి నామినేటేడ్ పోస్టులు కూడా ఇవ్వలేదని కవిత చెప్పారు. ఉద్యమంలో మనల్ని అవహేళన చేసి లాఠీలతో కొట్టించిన వారే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెత్తనం చెలాయించారన్నారు. ఆనాడు పరిపాలన చేసిన కుటుంబంలో తాను కూడా భాగమేనని అందుకు క్షమాపణ మాత్రమే చెబితే సరిపోదని కవిత అన్నారు. సామాజిక తెలంగాణలో కోసం కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని…తమ పనితీరు ఎలా ఉంటుందో ముందు ముందు ప్రజలు చూస్తారన్నారు. ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయ అధికారం కావాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగ పరంగా ప్రజా ఉద్యమాలను మిళితం చేసి రాజకీయాలు చేస్తామన్నారు. ఏ పార్టీకైనా ఆత్మ నేపథ్యం ఉండాలని…బీఆర్ఎస్ దాన్ని కోల్పోయిందని చెప్పారు. బీఆర్ఎస్ ఆత్మను కోల్పోయినందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చిందన్నారు.
ఆత్మలేని మరబొమ్మ, మారిన మనిషి కేసీఆర్
తన తండ్రి కేసీఆర్ మీద కవిత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆనాటి కేసీఆర్, నేటి కేసీఆర్ వేరని చెప్పారు. ఆ నాటి కేసీఆర్ చేనేత కార్మికులు చనిపోతే బిక్షాటన చేసి సాయం చేశారని గుర్తు చేశారు. కానీ మారిన, మర మనిషి కేసీఆర్ ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్న బయటకు రావటం లేదన్నారు. వెలుగుమట్లలో, హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చేస్తుంటే అయ్యా కేసీఆర్ అని ప్రజలు పిలుస్తుంటే కూడా సార్ బయటకు రావటం లేదన్నారు. ఎక్కడ ఎవరికీ చిన్న కష్టం వచ్చిన ఆ సార్ బయటకు రారు. ఎందుకంటే ఆయన ఆత్మలేని మర బొమ్మ అంటూ కవిత తీవ్ర పదజాలం వాడారు. ఆనాడు సింగరేణిలో కార్మికుడు చనిపోతే వెళ్లి పరామర్శించిన ఆయన…నేడు చేవెళ్లలో బస్సు ప్రమాదంలో చాలా మంది చనిపోయిన సరే పట్టించుకోలేదని విమర్శించారు. అధికారం వచ్చిన తర్వాత ప్రేమ, మమకారం పోయిందా అంటూ ప్రశ్నించారు. అవినీతి చేస్తే కొడుకునైనా, కూతురినైనా సరే వదలనని కేసీఆర్ గతంలో చెప్పారని కవిత గుర్తు చేశారు. కానీ తాను కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని చెబితే ఆ అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకొని తననే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్ బందీ అయ్యారన్నారు. ఆర్డీఎస్ ద్వారా నీళ్ల కోసం ఆనాడు పాదయాత్ర చేసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కేంద్రంతో గొడవ పెట్టుకోకపోయింటే పాలమూరు-రంగారెడ్డి పూర్తయ్యేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో నీళ్ల కోసం లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారని చెప్పారు. రాష్ట్రంలో ఏదో పీకి కట్టలు కట్టారని పంజాబ్, గుజరాత్, బీహార్ వెళ్లి జాతీయ పార్టీ పెట్టాలని చూశారని విమర్శించారు. పైగా ప్రజలే తప్పు చేశారన్నట్లుగా కేసీఆర్ గారు రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నారని కవిత అన్నారు. తాను ఎన్ని మాట్లాడిన సరే బీఆర్ఎస్ నేతలకు సమాధానం చెప్పటం చేతకావటం లేదన్నారు. ఇప్పుడు కూడా సమాధానం చెప్పకపోతే ప్రజలే బయకు లాగి సమాధానం చెప్పేలా చేస్తారన్నారు.

సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి బీజేపీ
బీజేపీ అంటేనే సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి అని కవిత విమర్శించారు. ఆ పార్టీ పెద్దలకు అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదని చెప్పారు. ఒకరు తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అంటే మరొక తలకాయ లేని ఎంపీ తెలంగాణ ఏర్పాటును ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చడని గుర్తు చేశారు. తెలంగాణను అవమానించేలా మాట్లాడిన సరే ఇక్కడి బానిస ఎంపీలు నోరు మెదపటం లేదన్నారు. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వకపోయిన సరే ప్రశ్నించటం లేదన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారని చెప్పారు. పోలవరం కారణంగా భద్రాచలం వద్ద ఐదు గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉందని ఆ గ్రామాలను తెలంగాణకు తేవాలని బీజేపీ ఎంపీలను కవిత డిమాండ్ చేశారు. ఈ అంశంపై జాగృతి పోరాటం చేసిందని కేంద్రానికి, ఆంధ్రా ప్రభుత్వానికి లేఖ రాసిందని ఆమె గుర్తు చేశారు. బీజేపీ ఎంపీలు 8 మంది తెలంగాణ బిడ్డలైతే రాముని గుడి మునిగిపోకుండా ఐదు గ్రామాలను తెలంగాణకు తేవాలని సవాల్ విసిరారు. మొదటి నుంచి కూడా బీజేపీ సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి అని కవిత అన్నారు. మహిళ బిల్లును, కుల గణన, బీసీ బిల్లును తొక్కి పెట్టారన్నారు. పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీ పథకాన్ని కూడా లేకుండా చేశారని విమర్శించారు.
అమర వీరులకు నివాళులు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ ప్రకటనకు ముందు బంజారాహిల్స్ లోని నివాసంలో కవిత, అనిల్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గన్ పార్క్ లోని అమర వీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్నారు. కన్వెన్షన్ సెంటర్ ప్రధాన ద్వారం (కాళోజీ ద్వారం) వద్ద తెలంగాణలోని అన్ని కళారూపాలకు చెందిన కళాకారులు, తెలంగాణ జాగృతి ఘన స్వాగతం పలికారు. కాళోజీ ద్వారం నుంచి సభా వేదిక వరకు కళాకారులతో కలిసి ర్యాలీగా తరలివచ్చారు. వేదికపైకి చేరుకొని కార్యకర్తలకు పిడికిలి బిగించి అభివాదం చేశారు. అనంతరం పార్టీ పేరును ప్రకటించారు. పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో పార్టీ జెండాను రూపొందించారు. సౌభాగ్యానికి ప్రతీక అయిన పసుపు, బడుగు, బలహీన వర్గాల సంపూర్ణ వికాసానికి ప్రతీక అయిన నీలం, పాడిపంటలతో అలరారే గ్రామసీమలకు, రైతన్నలకు ప్రతీకగా ఆకుపచ్చ రంగులను జెండాలో పొందుపరిచారు. పసుపు రంగు మధ్యలో నీలిరంగులో తెలంగాణ మ్యాప్ ముద్రించి ఇంగ్లిష్ అక్షరాల్లో టీఆర్ఎస్ అని ముద్రించారు. కింద ఆకుపచ్చ రంగు పట్టీలో తెలంగాణ రాష్ట్ర సేన పేరును ప్రింట్ చేశారు.
తెలంగాణ సాధన జాగృతి పిడికిలి బిగించి కొట్లాడింది
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, సాంస్కృతిక వికాసం కోసం తెలంగాణ జాగృతి అహర్నిశలు పిడికిలి బిగించి కొట్లాడిందని గుర్తు చేశారు. తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని తెలంగాణ జాగృతి కార్యకర్తలు పదిలంగా కాపాడుకున్నారని గుర్తు చేశారు. కాళరాత్రిలో కాగడా మాదిరిగా తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ జాగృతి వెలుగునిచ్చిందన్నారు. బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతి ఇది అని ప్రపంచానికి జాగృతి చాటిచెప్పిందని ఆమె చెప్పారు. ఐతే ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యాలు నేరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవిష్యత్ ను రాసుకోవటానికి తాను కొత్త పార్టీతో ముందుకు వచ్చానని చెప్పారు. తన జీవితంలో ఇది మరుపురాని రోజు అన్నారు.

భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు
కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ప్రకటన సభకు తెలంగాణ నలుమూలల నుంచి జాగృతి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 1,500 బస్సులు, 2 వేలకు పైగా ఇతర వాహనాల్లో మునీరాబాద్ కు చేరుకున్నారు. సుమారు 40 వేల మంది కార్యకర్తలు తరలిరావడంతో సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సభ అనంతరం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. పార్టీ ప్రకటన అనంతరం క్యాడర్ తో కలిసి కల్వకుంట్ల కవిత భారీ ర్యాలీగా హైదరాబాద్ కు తిరిగివచ్చారు.

