కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు
నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి:
రైతులకు మద్దతు ధర ద్వేయమే ప్రభుత్వ లక్ష్యం అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో సోమవారం సహజ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ఏఎంసీ వైస్ చైర్మన్ ఎలాల వెంకటరెడ్డి, ఎఫ్పీఓ చైర్మన్ కుంభాల రాజిరెడ్డి, గ్రామ సర్పంచ్ పొనకంటి వెంకట్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు గ్రామంలోనే ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించి పూర్తి లబ్ధి పొందాలని కోరారు. ఎఫ్పీఓ ద్వారా రైతులకు పారదర్శకంగా సేవలు అందుతాయని, వెంటనే ఆన్లైన్ చెల్లింపులు జరుగుతాయని తెలిపారు.తేమ శాతం 17% లోపు ఉండేలా, తాలు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురావాలని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆకు రాజ్ కుమార్, గ్రామ పరిపాలన అధికారి జి.రాజేశం, సభ్యులు, వార్డు సభ్యులు,కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గంగాధర్, బీసీ సెల్ మండల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూస రాజేశ్వర్, మండల నాయకులు, ఎఫ్పీఓ డైరెక్టర్లు, గ్రామ రైతులు పాల్గొన్నారు.


