శ్రమదానంతో గుంతల పూడ్చివేత
నవగీతం, కథలాపూర్ ప్రతినిధి:
రహదారి నిబంధనలపై అవగాహన కలిగి ఉండటం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం కథలాపూర్ మండలం తాండ్రియాల్ గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సమీపంలోని బీటీ రోడ్లు, స్థానిక రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లను) అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి గుర్తించారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో రహదారిపై ఉన్న గుంతలను పూడ్చివేసి మరమ్మతులు చేపట్టారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎం.శంకర్, ఎస్సై రవికిరణ్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రవి, ఆర్‌అండ్‌బీ, ఆరోగ్యశాఖ అధికారులు, గ్రామ సర్పంచ్ జంగ శివాని-రంజిత్, ఉపసర్పంచ్ అల్లూరి జనార్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


